Showing posts with label మాంగల్యధారణ విశిష్టత నేటి మహిళలు. Show all posts
Showing posts with label మాంగల్యధారణ విశిష్టత నేటి మహిళలు. Show all posts

09 September 2016

మాంగల్యధారణ విశిష్టత

మాంగల్యధారణ విశిష్టత నేటి మహిళలు కొంతమంది . వివాహం అంటేనే మంగళసూత్రం. మంగళసూత్రం అంటేనే వివాహం. పురుషుడు తాను పుట్టగానే నేను పుట్టాను అని గుర్తుగా ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక తోబుట్టువుకు గాని ఏ గుర్తు మిగల్చడు. కాని వివాహ సమయంలో మంగళసూత్రధారణ చేసేటప్పుడు మటుకు నేనున్నాను అని గుర్తుగా నీ మేడలో మంగళసూత్రం కడుతున్నాను అని ముక్కోటి దేవతల సాక్షిగా మూడుముళ్ళు వేస్తూ మంగళసూత్రం కడతాడు. మరి మనము ఆ మంగళసూత్రం అడ్డుగా ఉంది అని బీరువాలో భద్రపరిస్తే అతని ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది కదా. పైగా ప్రతి ఆడది కోరుకునేది వందేళ్ళు సుమంగళిగా ఉండాలనీ, తన భర్త కళ్ళముందు ఆయన ఒడిలో తలపెట్టుకుని తను తుది శ్వాస వదలాలని కోరుకుంటుంది. మరి ఆ అయిదోతనం అంతా ఆ మంగళసూత్రంలోనే ఉంది కదా. మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు కూడా ఆ మంగళసూత్రం హృదయస్థానాన్ని తాకుతూ ఉండాలి అని మాంగల్యధారణ సమయంలో మంగళసూత్రాల్ని హృదయానికి పట్టుకొమ్మని పెళ్లి మంత్రాలను బ్రహ్మగారు చదువుతారు. హృదయస్థానంలోనే కట్టుకోవడానికి కారణం హృదయంలో ఎప్పుడూ ఆ పార్వతీపరమేశ్వరులు కొలువై ఉంటారు. ఎప్పుడూ ఆ మంగళసూత్రాలు హృదయస్థానానికి తాకుతూ ఉండటం వల్ల, ఆవిడ ఎల్లప్పుడూ ఆ సర్వమంగాళాదేవతని ఆరాధించడం వలన ఆవిడ ఎప్పటికీ సుమంగళిగా ఉంటుంది. అలాగే మాంగల్యధారణకు పసుపుతాడునే వాడుతారు. మూడు ముళ్ళు వేసిన తరువాత ప్రతిముడికి కుంకుమను అద్దడానికి కారణం, పసుకు కుంకుమలలో ఆ సర్వమంగాళాదేవత ఆవాహన అయి ఉంటుంది. అందుకనే నాంతాడు (మంగళసూత్రాలను కట్టుకునే బంగారు తాడు) మధ్యలో తాడు మటుకు పసుపుతాడే అయి ఉండాలి. ఎలాంటి లోహముతోనూ చుట్టించుకోకూడదు. మాంగల్యధారణ సమయంలో మూడుముళ్ళే వెయ్యడానికి కారణం మన సనాతన ధర్మంలో ఏది మూడుసార్లు అన్నా అది సత్యం అవుతుంది. అలాగే ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు కూడా. 1) బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు 2) తాంబూలంలో ఆకు, వక్క, సున్నం 3) సత్వ, గుణ, రజో గుణములు 4) యోగాగ్నిలో ఉపయోగించే అగ్నులు మూడు. అలాగే స్థూల దేహము, ఇప్పుడు ఉన్న శరీరం సూక్ష్మ శరీరం సాక్షిగా అనగా మనం చేసే పాప, పుణ్యాలకు సాక్షిగా కారణ శరీరం. ఏ కారణంగా మనం ఈ శరీరాన్ని అనుభవిస్తున్నామో ఈ మూడింటికి కలిపి స్థూల, సూక్ష్మ, కారణ, మూడు ముళ్ళు వేస్తాడు. అందుకనే ఒక వేళ ఏ కారణం చేత భర్త చనిపోయినప్పటికీ (అటువంటి అమంగళము ఎవరియందు జరగకుండుగాక) ఆమెను, ఆయన భార్యే అంటారు. అందుకనే ఆవిడ నూరేళ్ళు పసుపుకుంఖాలతో ఉండాలని వివాహ సమయంలో మంగళసూత్రాలను 100 నిష్కముల బంగారం అనగా 8 గ్రాముల బంగారంతో చేయిస్తారు. ఒక యింటి సౌభాగ్యం అంతా ఆ ఇంట ఉండే స్త్రీ యొక్క మంగళసూత్రంలో ఉంది అంటే అతిశయోక్తి కాదేమో. అందుకనే మనమందరం మాంగల్యం యొక్క విలువను తెలుసుకుని మన అభివృద్ధికి వ్యక్తి పరంగా మాంగల్యం ఉండకూడదు అని ఎవరైనా శాసిస్తే అలాంటి ఉద్యోగాలు మాకు అఖ్ఖర్లేదు, నేను వివాహితని, నా మంగళసూత్రం నాకు ప్రాణం అని మనమందరం ఒక్క మాట మీద ఉండగలగాలి. ఆ కంపెనీ దిగివచ్చి అలాంటి శాసనాల్ని మార్చివేస్తాయి. అందుకనే మనము తాళిని ఎగతాళి చేయకుండా అలా ప్రవర్తిస్తున్నవారికి మనకి తోచిన మంచి మాటలు చెప్పి వారిని దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి. యువతే ప్రపంచం. మన దేశ స్త్రీలకు చేతులెత్తి నమస్కరించాలి. మన కట్టు, బొట్టు, సనాతనధర్మాల్ని మన విలువలను కాపాడుకుంటూ ఇంతే జాగ్రత్తగా ముందుతరాలకు అందచేయడానికి మనము కూడా ఒక సమిధ అవ్వాలి.