23 February 2016

 గృహ వివాహ ప్రాయాణ శుభ ముహూర్తములు

 గృహ వివాహ శుభముహుర్తములు:

కాలామృతం ఆధారంగా వైశాఖంలో గృహప్రవేశం గృహపతికి బహుపుత్రంబు,

జ్యేష్ఠమాసం శుభప్రదము.
ఫాల్గుణమాసం సంపత్కరము,
మాఘం ధాన్య ప్రదము. అయితే ఉత్తరాయంలో కుంభంలో రవి ఉండగా తప్పమిగిలిన అన్నియు శ్రేష్ఠములే. బహుగ్రంధకర్తలు కార్తీక, మార్గశిర, శ్రావన మాసములు శ్రేష్ఠములు అని తెలిపిరి.



వారములు:
 ఆదివారము అత్యంత దుఃఖమును క్షీణేందువారము. (బహుళసప్తమి తర్వాత సోమవారము) కలహమును, పూర్ణేందు వారము సంపదను,
మంగళవారము అగ్నిభయమును,
 బుధవారము ధాన్యమును,
 గురువారము పశుపుత్రులను,
శుక్రవారము శుభసౌఖ్యములోను,
 శనివారము స్థైర్యమును, చోరభయమును కలుగచేయును.




 నక్షత్రములు : చిత్త, అనూరాధ, ధనిష్ఠ, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, రేవతి, శతభిషం, రోహిణి, మృగశిర, ఈ నక్షత్రములు ప్రశస్తమైనవి.


పుష్యమి మధ్యమము.
పునర్వసు, స్రవణం నక్షత్రములలో గృహప్రవేశమైన ఆ ఇల్లు అన్యాక్రాంతమగును.
ఆర్ద్ర, కృత్తిక, అగ్నిభయమును కలుగచేయును.

లగ్నములు : కర్కాటక లగ్నమునందు గృహప్రవేశము నాశనము, తులాలగ్నమునందు గృహప్రవేశమును వ్యాధిని,

 మకరలగ్నమునందు గృహప్రవేశమును ధాన్య నష్టము, మేషలగ్నము నందు చలనమును కలుగచేయును,

వృషభ, సింహ లగ్నములు స్థిరములు అయినకారముగా ఆ లగ్నము నందు గృహప్రవేశము మంచిది. మిధున, కన్యా, ధనుర్మీన లగ్నములు గృహ ప్రవేశమునకు శుభప్రదమైనవే.





విశేషములు : గృహప్రవేశమునకు 4,8,12 స్థానములు శుద్ధిగా ఉండుట విశేషము. 4 గృహస్థానము, 8 ఆయఃస్థానము, 12 వ్యయస్థానము అయినకారనముగా ఈ స్థానములు శుద్ధిగా వుండవలెను,

3,6,11 ల యందు పాపగ్రహములు,

1,2,4,5,7,9,10,11 లలో శుభగ్రహములుండగా గృహప్రవేశము విశేషము.


ద్వారం ఎత్తుటకు : పాడ్యమి, విదియ, తదియ, పంచమి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ తిధుల యందును, సోమ, బుధ, గురు, శుక్ర, వారముల యందును శుభగ్రహ హోరలయందును ద్వారం ఎత్తుటకు మంచిది. శ్లాబ్ విషయమై కూడా అంతే. వర్జ్య, దుర్ముహుర్త, రాహుకాలములు విడచి సూర్యోదయము మొదలు మధ్యాహ్నం లోపల శ్లాబ్ వేయుట ప్రారంభించాలి అలాగే ద్వారం ఎత్తాలి. దీనినికూడా ఆషాడ, భాద్రపద,పుష్యమాసములు పనికిరావు. నామ నక్షత్ర వినియోగం సంగ్రామ, వ్యవహారములకు, ధామార్వణం, నగరార్వణం, మంత్రార్వణం విషయములలోను నామ నక్షత్రము చూడవలెను. ధామార్వణం విషయంలో కాలామృతం సంస్కృత వ్యాఖ్యానంలోక్షేత్రార్వణం అని వివరించిన కారణంగా గృహము ఏదిశలో కట్టుకోవాలి. ఆయాది వివరణల విషయంగా నామనక్షత్రం వాడి ముహూర్త విషయంలో జన్మ నక్షత్రం వాడవలెను.










 బోరింగ్ లేదా బావి తీయుటకు ముహూర్తం : హస్త, పుష్యమి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి, మఘ.... ఈ నక్షత్రాలు శ్రేష్ఠము.



 ఆది, మంగళ, శనివారములలో తీయుబావులయంధు నీరు ఎక్కువకాలం వుండదు.

 మీన, మకర, కర్కాటక, వృషభ, కుంభ లగ్నములందును, లగ్నానికి చతుర్థస్థానముకు పాపగ్రహ సంబంధం లేకుండాను చూచుకొని ముహూర్తం చేయవలెను. జలరాసులు " మత్స్యే కుళిరే మకరే బహోదకం, కుంభేవృషే చార్థజల ప్రమాణం, అళ్యంచ తౌల్యామ్ మిధునేన పాదం శేషేతు రాశఊ జలనాశంచ"







శంఖుస్థాపన చేయుటకు మాసములు :
 చైత్రమున ధనహాని,

వైశాఖం శుభం,
 జ్యేష్ఠం మరణం,
ఆషాఢం పశునాశనం,
శ్రావనం భృత్యవృద్ది,
 భాద్రపదమాసం ప్రజాపీడ,
 ఆశ్వయుజం కలహప్రధం,
కార్తీకం ధనలాభం,
 మార్గశిరం భయము,
పుష్యం అగ్నిభయము,
మాఘం అధిక సంపద,
 ఫాల్గుణం రత్నలాభం.






నక్షత్రములు : అశ్విని,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉషా, శ్రవనం ధనిష్ఠ, శతభిషం ఉత్తరాభద్ర,రేవతి. వారములు: ఆది, మంగల, శని వారములు నిషేధము. అయితే శని ఆదివారములు వాడుకలో ఉన్నవి. లగ్నబలం : వీలైనంతవరకు పాపగ్రహ సంభంధంలేని ఏ లగ్నమైనా, లగ్నము అష్టమముతో పాపగ్రహములు లేని లగ్నము, కుజగురువులు బలంగా వున్న గ్రహములు స్వీకరించాలి.






 స్థలం రిజిష్ట్రర్ చేయించుకోవడానికి: చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య తిధులు, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పూర్వాభాధ్ర నక్షత్రములు, మంగళవారం కాకుండాచూచుకొని, స్థలము రిజిస్త్రేషన్ చేయించుకోవాలి. అయితే రిజిష్టర్ చేయించుకొనే సమయానికి వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం వుండకూడదు. వీలైనంతవరకూ శుభగ్రహ హోరల సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 




మీనం, మకరం, కర్కాటకం, వృశ్చికములకు అంత్యములో రాహువు అనే త్యాజ్య ఘడియలు వుండును.


మిధున, కుంభ, తుల, సింహలగ్నమునకు మధ్యలో జృధ్ర అనే త్యాజ్య ఘడియలు వుండును. అందువలన వీటిని విడచి మిగిలిన లగ్న కాలములో శుభకార్యములు చేసుకొనవచ్చును


 పెండ్లి ముహూర్త విషయాలు ఏక నక్షత్ర వివాహ విషయము : రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్రముల విషయంలో వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు.

అశ్వని, భరణి, ఆశ్రేషా, పుబ్బ, స్వాతీ, మూల శతభిషం యివి మధ్యమములు తక్కిన నక్షత్రములు దోషములు. అయితే 27 నక్షత్రములలో కూడా ఒకే నక్షత్రము అయినప్పటికీ భిన్న పాదములు అయినచో దోషం లేదు.



ఏక కాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయములో పుత్రిక వివాహానంతరము పుత్ర వివాహము ముఖ్యమ్ననియు పుత్ర వివాహానంతరము పుత్రికా వివాహమునకు పుత్ర ఉపనయనము అయిన చేయ కూడదనియు పుత్ర ఉపనయనాంతరము పుత్రికా వివాహము శుభకరమనియు పుత్ర వివాహము చేసిన సంవత్సరమ్మునందు ఆరు నెలల పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు అశుభకరములు. 



ఫాల్గుణే చైత్ర మాసేతు పుత్రోద్వాహోపనయనాయనే అబ్ద భేదాత్ర్పకుర్వీత ఋతుత్రయ విడంబన" అనగా ఫాల్గుణ మాసంలో ఒకరికి చైత్రమాసంలో మరొకరికి సంవత్సరము భేధం ఉన్నందున వివాహ, ఉపనయనాదులు చేయ వచ్చును.


 కన్యాదాతల నిర్ణయం : కన్యాదానము చేయు అధికారము తండ్రికి, త్యండ్రి కానిచో పితామహుడు, సోదరుడు, పిన తండ్రి, పెత్తండ్రి మెదలగు పితృవంశస్థులు వారు కానిచో స్వగోత్రీకులు కానిచో ఎవరైనను చేయ వచ్చును.





 కుజదోష నివారణ : పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్ఠమేకుజే స్థితః కుజః పతింహంతి నచేచ్ఛు భయతేక్షితః ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమోధవాశనిః పతిహంతాస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః (బృహతృరాశరీరాశాస్త్రం) జన్మలగ్నము - చంద్రలగ్నముల లగాయతు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నయెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికి వున్నను లేక ఇరువురికి లేకున్నను వివాహం చేసుకొనవచ్చును. ఈ దోషం ఒకరికుండి మరొకరికి లేకున్నను వైవాహిక జీవితం కలహ ప్రదంగా వుంటుంది.




 కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు. కావున పైన చెప్పిన విధానంలో శని దోషం కూడా చూడవలెను అని పరాశర మతం " నచేచ్ఛభయతేక్షితః" అనివున్న కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహ వీక్షణ వున్నచో దోషం వుండదు. కేవలం ఆడవారి జాతకంలో వుంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవారికి ఇబ్బంది.




  



 ద్వితీయ స్థితి కుజదోషం మిధున కన్యలకు లేదు. ద్వాదశ స్థితి కుజదోషం వృషభ తులలకు లేదు. చర్తుర్ధస్థితి కుజదోషం మేషవృశ్చికములకు లేదు. సప్తమ స్థితి కుజదోషం ధనుస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయినచో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నములవిషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త, నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.




నిశ్చితార్ధం : నిశ్చితార్ధమునకు పెండ్లితో సమానమైన, సమాన బలమైన ముహూర్తం చూడవలెను. కారణం నిశ్చితార్ధంతోనే వధూవరులు భంధం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండ జాతక ప్రభావాలు వారిరువురికి ఒకరి ప్రభావం మరొకరి మీద చూపుతుండి. వివాహమునకు సంభంధించిన తిధి వార నక్షత్ర లగ్నములు చూడవలెను. అయితే నిశ్చితార్దం రోజున గణపతి పూజ చేయవలెను. కావున భోజనానంతరం పూజ పనికి రాదు. కావున ఉదయ సమయంలోనే నిశ్చితార్ధం చేయవలెను.




 నూతన వధూవాస దోషములు :  అయిన ప్రథమ సంవత్సరం ఆ వధువు అత్తవారింట ఉన్నచో ఆషాఢమాసంలో అత్తగారికి గానీ, అధిక మాసం అందు భర్తకును, పుష్య మాసంలో మామగారికి గానీ గండము. మొదటి సంవత్సరము చైత్ర మాసంలో తండ్రి యింట ఉన్న ఎడల తండ్రికి హాని అని వున్నది కానీ ఈ ఒక్క విషయము ఆచారం లేదు.









పెండ్లి చూపులకు : సోమ, మంగళ వారములు కాకుండాను భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పుర్వాభద్ర, నక్షత్రములు కాకుండా, వ్యర్జ దుర్ముహర్తములు లేకుండాను, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య కాకుండా శుభగ్రహ హోరాలయందు పగటి సమయమున పెండ్లి చూపులఏర్పాటు చేయవలెను.




పెండ్లి పనులు ప్రారంభించుటకు : సోమ, మంగళ వారములు విడువవలెను అశ్వని, రోహిణి మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉషా, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, నక్షత్రములయందు విదియ, తదియ, పంచమి సప్తమి, దశమి ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ, బహుళ పాడ్యమి తిధుల యందు, శుభగ్రహ హోరాల యందు వర్జ్యం దుర్ముహర్తం వదలి పెండ్లి పనులు ప్రారంభించాలి.





వధూప్రవేశము : వివాహ దిన ప్రభృతి పదహారు రోజుల లోపల ఎప్పుడైననూ సరిదినముల యందునూతన గృహప్రవేశం చేయవచ్చును. వధూ ప్రవేశోనది వాప్రశస్తుః నూతన వధువు అత్తవారింట అడుగు పెట్టవలెను అంటే పగలు పనికి రాదు.  

వివాహము అయినది మొదలు ఆరు, ఎనిమిది, పది దినములందు వధువు ప్రవేశించిన ఎడల ఆ దినములు తిధి వారనక్షత్ర యోగకరణములచే శుద్ధము కాకపోయినప్పటికీ శుభ ప్రదముగానే వుంటుంది. ఒక వేళ మొదటి నెలలో వదూ ప్రవేశం జరగనిచో మెదటి సంవత్సరంలో బేసి నెలలో స్థిర, క్షిప్ర, మృదు, శ్రవణ, ధనిష్ఠ, మూల, మఘ, స్వాతీ, నక్షత్రదినములందు రిక్త తిధులను విడచి నూతన వధూ ప్రవేశం చేయ వలెను. ఎప్పుడు వధూ ప్రవేశం చేసిననూ వర్జ్య దుర్ముహోర్త కాలములు విడువవలెను.






  ఎవరు వివాహ ప్రయత్నములు చేయదలచారో వారికి నక్షత్రం తారాబలం కుదిరిన రోజున, భరణి, కృత్తి, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రేష, పుబ్బ, చిత్త, విశాఖ, జేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలను విడచి, మంగళ, సోమ వారములు కాకుండా, వర్జ్య దుర్ముహూర్తములు లేని సమయంలో గణపతిని ప్రార్ధించి తదుపరి యిష్టదైవమును ప్రార్ధించి వివాహప్రయత్నము చేయ వలెను.









వివాహం : భరణి, కృత్తిక, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్ర నక్షత్రములు పనికిరావు. చిత్త పనికి వస్తుంది అని కొందరి వాదన. బుధ, గురు, శుక్ర, శని, ఆది వారములు పనికి వస్తాయి. అయితే అన్ని గ్రంధాలలో శుభగ్రహవారములు అన్ని వున్న కారణముగా క్షీణ చంద్రుడు కాని సమయములో వున్న సోమవారాం పనికి వస్తుంది.




బహుళ ఏకాదశి నుండి అయిదు రోజులు, పితృతిధులు వున్నరోజులలో వివాహం పనికి రాదు. పాపగ్రహ వీక్షణ వున్న సమయంలో సప్తమంలో అష్టమంలో పాపగ్రహములు వున్న లగ్నములు పనికిరావు మాఘ, ఫాల్గుణ, చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజంలో దసరా తర్వాత కార్తికం, మార్గశిరంలో ధనుర్మాసం ముందర వివాహములు చేయుట ఆచారంగా వున్నది. మధ్యాహ్నం 12 లోపల, మరల సూర్యాస్తమయం తర్వాత వివాహం చేయవచ్చు.






వివాహం -ఆబ్దికం : వివాహమునకు ముందురోజు ఆబ్దికం వున్నచో ఆ ముహుర్తం పనికిరాదు. ఇది కన్యాదాత విషయంలోను వరుడు, వరుని తండ్రి ఆబ్దీకములు పెట్టవలసినవిషయంలో మాత్రమే. వివాహం చేసిన నెలలోపుగా వధూవరుల యిండ్ల వారి పైతలరాలవారి ఆబ్దీకములు రాకుండా చూసుకుని వివాహముహోర్తం నిర్ణయించాలి.



 జ్యేష్ఠమాసంలో వివాహం చేస్తే త్రిజ్యేష్ఠ అవుతుంది. అలాగే ఆ వధూవరులు ఒకరు జ్యేష్ఠమాసంలో జన్మించిన మరొకరు జ్యేష్ఠులైతే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయ కూడదు. మిగిలిన మాసంలో చేయుటకు అభ్యంతరంలేదు. ఎటువంటి త్రిజ్యేష్ఠా స్వరూపం అయినా జ్యేష్ఠమసంలో మాత్రమే వివాహం నిషేధం మిగిలిన మాసంలో దోషంలేదు.





ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారముల యందును నూతన వస్త్రధారణ మాంచిది. మంగళవారం ఎర్రని వస్త్రములు ధరించుటకు మంచిది.



పునర్వసు, పుష్యమి నక్షత్రములందు దృవనక్షత్రములయందును, మంగళవారము నందును సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రాభరణధారణ చేయకూడదు. మౌఢ్యమునందు విడువవలసిన కార్యములు వ్యాపారం, తటాక, కూప, గృహారంభ, గృహప్రవేశములు, వ్రతారంభ, వ్రతోద్యాపన, వధూప్రవేశ, మహాదాన సోమయాగాష్టకా శ్రాద్ధములు సంచయన, ప్రధమో పాకర్మ వేధవ్రతములు, కామ్య వృషోత్సర్గ వివాహాదుల, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయన, చూడా కర్మలు, కర్మలు, అపూర్వ దేవతీర్ధ దర్శనము, సన్యాగ్రహణము, అగ్నిస్వీకారము, రాజ దర్శనము, రాజ్యాభిషేకము, యాత్ర, సమావర్తనము, కర్ణవేధనలు చేయకూడదు.



అయితే మాస ప్రాధాన్యములైన సీమంతము పుంసవనం, నామకరణం, అన్నప్రాశన వంటివి చేయవచ్చును. ,













 ప్రయాణమునకు ఆడపిల్లను క్రొత్తగా కాపురమునకు పంపుటకు ఆది, మంగళ, శుక్రవారములు పనికిరావు, ఉగ్రదారుణ నక్షత్రములు దోష భూయిష్ఠము. నిర్ఘ్య విషయము : నిషిద్ధ కాలమందు తప్పనిసరి ప్రయాణమైనచో ఆదివారము బంగారమును, సోమవారము- వస్త్రం, మంగళ - ఆయుధం, బుధ-పుస్తకం, గురు- గొడుగు,టోపి, తలపాగాలలో ఒకటి, శుక్ర - చెప్పులు లేదా వాహనం, శని - కంఠమున ధరించువస్తువులను - ప్రయాణ మార్గమందలి ఎవరియింటనైనా నిర్ఘ్యముంచుకొని - అవసరవేళ శుభ శకునమున ప్రయాణమై వెళ్ళవచ్చును.



శుభతారలు : అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, రేవతి, నక్షత్రములు శ్రేష్టము. రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాధ్ర, శతభిషం, మధ్యమములు. తక్కిన తారలు నిషిద్దములు మంచి నక్షత్రములందు వార శూలాలూ, ఆనందాది యోగాలు చూచుకొని ప్రయాణించవలెను. ఉభయ పక్షములందలి 2, 3, 5, 7, 10, 11, 13 తిధులు మరియు కృష్ణ 1 మంచిది. శుభవారములు : తూర్పునకు మంగళవారము, దక్షిణమునకు సోమ, శని వారములు, పడమరకు బుధ, గురు వారములు, ఉత్తరమునకు ఆది, శుక్ర వారములు మంచివి.









స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం - గుణగణాలు,

 ఫలితాలు నక్షత్రములలో స్వాతి నక్షత్రము 15వది. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. రాజ్యాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి రాహువు, ఆధిదేవత వాయువు, జంతువు మహిషము, జాతి పురుష, దేవగణాధిపతి(దేవగణము) ఇంద్రుడు.








 స్వాతి నక్షత్రము మొదటి పాదము స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. దేవగణ ప్రధానులు కాబట్టి వీరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది.

ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా రచయితలు కావడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం కూడా కలదు. ఉపాధ్యాయులుగా మరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నక్షత్ర జాతకులు రాహుదశలో జన్మించడంవల్ల కొన్ని సమస్యలు ఎదురైనా తల్లితండ్రుల చాటున కష్టం తెలియకుండా సాగిపోతుంది. వీరికి హైస్కులు తరువాత గురు దశ కాలంలో కాలేజి విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. 16 సంవత్సరాలకే గురు దశ వస్తుంది కనుక సౌఖ్యవంతమైన జీవితం మొదలవుతుంది. విద్యలో చక్కని అభివృద్ధి సాధించి ఉద్యోగాలలో స్థిరపడతారు. ఇక సకాలంలోనే వివాహం జరుగుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం వీరికి అత్యవసరం. లేకుంటే 32 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో అనేక ఇబ్బందులకు గురవుతారు. 51 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం ఉంటుంది. ఇక మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.










 స్వాతి నక్షత్రము రెండవ పాదము స్వాతి నక్షత్రము దేవగణ ప్రధానులు కనుక రెండో పాదములోని జన్మనక్షత్రలు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద శని రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి బద్ధకం కొంచం ఎక్కువ. అయినప్పటికీ పని ఆరంభించారంటే బాగా శ్రమించి పని పూర్తి చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు. వీరికి రాహుదశ దాదాపు 11 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 27 సంవత్సరాల నుండి ఉండే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. 46 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కొంచం కుదుట పడతాయి. తర్వాత 63 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం అనుకులిస్తుంది. ఇక వృద్ధాప్యం సౌఖ్యంగా సాగుతుంది. వీరికి కర్మాగారాలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్ధ్యం ఉంటుంది. కర్మాగారాలలో, పరిశ్రమలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. అయితే వీరు దత్తు పోయే అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.








 స్వాతి నక్షత్రము మూడవ పాదము వీరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ పని మొదలు పెట్టారంటే బాగా శ్రమించి పని చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు. కర్మాగారాలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించగలరు. కర్మాగారాలలో, పరిశ్రమలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. స్థిరమైన అభిప్రాయలు ఉంటాయి. వీరు దత్తు పోవడానికి అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు. వీరికి రాహుదశ దాదాపు 7 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక ఆరంభంలో రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి ఉండే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 42 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 59 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 66 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్య దశ కూడా సాఫీగా సాగిపోతుంది.











 స్వాతి నక్షత్రము నాలుగవ పాదము వీరు సాత్విక ప్రవృత్తి కలిగి వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కూడా రచయితలు అయ్యే అవకాశం కలదు. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులుగా పని చేసే అవకాశం కూడా ఉండవచ్చు. వీరు దత్తు పోవడానికి అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు. ఈ నక్షత్ర జాతకులకు రాహుదశ దాదాపు మూడు సంవత్సరాల కాలం ఉంటుంది. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత చదువులలో కొంత మందకొడితనం ఉంటుంది. ప్రయత్నంతో విజయం సాధించ వచ్చు. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం జాప్యం జరుగుతుంది. 19 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల శని దశ కాలం ఉంటుంది.. కాబట్టి ఆ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 38 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 55 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 62 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్యం సౌఖ్యంగా సాగిపోతుంది. స్వాతి నక్షత్ర జాతకుల గుణగణాలు రాహుగ్రహ అధిదేవత నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులు ముఖ్యంగా పరిశోధకులుగా రాణిస్తారు. బుద్ధికుశలతలతో పలు రంగాల్లో ఉన్నత అధికారులుగా విధులు నిర్వహిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనా శక్తి శుక్ర ప్రభావంతో సౌందర్య ఆరాధనాశక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. శాస్త్రవెత్తలుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావ కారణము వల్ల కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు సాహిత్యాన్ని, సంగీతాన్ని, సౌందర్యాన్ని ఆరాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆకస్మిక రాజకీయ జీవితం, ఉద్యోగం, విద్య, ఆర్థిక రంగంలో అత్యధిక అభివృద్ధి చెందుతారు. ప్రతి రంగంలోనూ స్వయం కృషి మంచి అభివృద్ధినిస్తుంది. సినిమా రంగంతో కూడిన ఏ కళారంగంలోనైనా ప్రవేశం రాణింపునిస్తుంది. నమ్మిన వారి చెంత విశ్వాసంతో ప్రవర్తిస్తారు. అంతర్గత, బహిర్గత శత్రువులు వీరికి అధికంగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వాటిలో ఏ మాత్రం సత్యముండదు. అంతేకాదు ఇతరులకు దానం చేయడంలో ముందు వరుసలో ఉండే ఈ జాతకులు సామాజిక స్పృహ కలిగి ఉంటారు. ఆర్థికంగా ముందడుగు వేయడంతో పాటు, కీర్తి ప్రతిష్టలు సంపాదించడాన్నే లక్ష్యంగా భావిస్తారు. కొన్ని విషయాల్లో సామాజిక విలువల్ని పట్టించుకోరు. ఈ లక్షణంతో ఈ జాతకుల నుంచి బంధువులు, సన్నిహితులు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వల్ల ఈ జాతకులకు విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది. ఇక ఈ జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి సోమవారం రాహుగ్రహ శాంతికి నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణతో పాటు ఐదుగురికి అన్నదానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.















విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్రము -
గుణగణాలు, ఫలితాలు నక్షత్రములలో ఇది 16వ నక్షత్రము. ఇది గురు గ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని. జంతువు పులి, రాజ్యాధిపతి కుజుడు. గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది.













విశాఖ నక్షత్ర మొదటి పాదము విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. ఇక విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కళాశాల చదువులలో కాస్త మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా సుఖం కాస్త తగ్గవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం కలుగే అవకాశం ఉంది. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం జీవితకాలం సహకరిస్తుంది. ఉపాధ్యాయ వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. 33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన అనుకులిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.









 విశాఖ నక్షత్ర రెండవ పాదము ఈ జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కల్గి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆపాధ్యాయులు రంగ వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపు వర్ణ వస్తువులు, శ్వేత వర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యా ఆరంభ దశలో బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. పదేళ్ల వయసు వరకు జీవితం సాఫీగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. ఇక సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం తరువాత వచ్చే జీవితకాలానికి సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 














విశాఖ నక్షత్ర మూడవ పాదము వీరికి పనుల యందు పట్టుదల ఉంటుంది. కార్య నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. వీరు విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. ఈ నక్షత్ర జాతకులకు తొలి నుంచి విద్య మందకొడిగా ఆరంభమవుతుంది. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల వయసు వరకు జీవితం సుఖంగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. 42 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. ఇక మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.



















 విశాఖ నక్షత్ర నాలుగవ పాదము వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి మెండు. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయ రంగ వృత్తులు వీరికి అనుకూలం. ఔషధ సంబంధిత, శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. జన్మించిన తర్వాత కొంత కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సుఖం తగ్గుతుంది. ఆరు సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. 2 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. విద్యాభ్యాసం మందకొడిగా సాగుతుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన ఉంటుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.