25 February 2016

మనం తెలుసుకోదగ్గ విషయాలు

మన పురాణాలనుండి
మనం తెలుసుకోదగ్గ విషయాలు.

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.

4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.

5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.

6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.

7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.

8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.

10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.












11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.

12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.

18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.

19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.

20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.











21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.

22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.

24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.

27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి.

 ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.

28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.

29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.

30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.










31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.

32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.

34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.

35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.

36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.

37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.

38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.

39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.

40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.










41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.

42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.

43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.

46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.

47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.

48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.

50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.












51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.

55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.

56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.











61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.










71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.






81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలు.











తులసి పూజ

తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం

కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.



తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా నుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము.






అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః




ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.




తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.




తులసి పూజ ఎలా చేయాలి?

తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.





ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.




నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!



ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్



అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.



యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం



అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.



తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.



పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.



తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.





తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.





తులసి దళాలను ఎలా త్రెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.



తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.




మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే


తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!

(ఆహ్నిక సూత్రావళి)

శ్రెహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.






పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.




దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసీ దయాపూర్ణకలశీ అన్నారు ఒక గీతంలో. తులసి అంతటి వైభవము, దయ కల మాత. నిత్యం పూజిద్దాం, దళాన్ని సేవిద్దాం. సకల శుభాలను,ఆరోగ్యాన్ని పొందుదాం.