ప్రస్తుత జ్యోతిష గ్రంథములలో చంద్రుడిని శుభుడిగా పేర్కొన్నారు. ఒక చోట చంద్రుడు శుభునిగా చూపిస్తూ శత్రువులు లేరని మరల శని,శుక్ర,బుధ,రాహువు,కేతువులకు చంద్రుడు శత్రువని చెప్పారు.
చంద్రునికి శత్రువులు లేరని వీరికి చంద్రుడు ఎలా శత్రువవుతాడు అన్న విషయము ఆలోచించాలి.
గ్రహ మైత్రి పట్టికను వివరించాము.
ప్రస్తుత జ్యోతిష శాస్త్రములలో ప్రమానమయిన లగ్నమును అనుసరించి గ్రహములలో శుభులు పాపులు మిత్రువులు శత్రువులు వస్తారు అన్న విషయము తెలియక పోవడము చేతనో లేక చెప్పే వారు చెప్పలేదనో తెలుస్తున్నది కావున ఇప్పటి శాస్త్రములు చక్కటి మార్గము చూపలేక ప్రజలకు నమ్మకము పోతున్నది.
శుభ గ్రహము :
పూర్వ జన్మలలో చేసిన పుణ్య కర్మల (మంచి పనులు - ధర్మమయినవి) యొక్క పుణ్య ఫలమును ఏ గ్రహము ప్రసాదిస్తుందో ఆ గ్రహము శుభ గ్రహము అని అన్నారు.
అలాగే
పాప గ్రహము :
పూర్వ జన్మలలో చేసిన పాప కర్మల (చెడు పనులు-
అధర్మమయినవి) యొక్క పాప ఫలమును ఏ గ్రహము ప్రసాదిస్తుందో ఆ గ్రహము పాప గ్రహము అని అన్నారు
ఏ గ్రహము శుభుడో లేక పాప గ్రహమో ఎలా తెలుస్తుంది?
ప్రతీ లగ్నమును (మేష లగ్నం , వృషభ లగ్నం ) అనుసరించి ఆ లగ్నమునకు కొన్ని శుభ గ్రహములు కొన్ని పాప గ్రహములు నిర్ణయించబడినవి. ఆయా లగ్నములను అనుసరించి మాత్రమే శుభ పాప గ్రహములు వచ్చును కాని నిజముగా గ్రహములలో పాపులు ఎవ్వరూ లేరు.
ఉదా 1 : -
రాసి చక్రములో మకర లగ్నమునకు సప్తమ స్థాన అధిపతి అవడం వలన చంద్రుడు ఆ మకర లగ్నమునకు పాప గ్రహము అయ్యెను.
వరుసగా
1. మకరము 2. కుంభము 3. మీనము 4. మేషము 5.వృషభము 6.మిథునము 7. కటకము
ప్రతీ లగ్నమునకు సప్తమ స్తానము పాప స్తానం కావున ఆ సప్తమ స్థానము యొక్క అధిపతి అయిన గ్రహము ఆ లగ్నమునకు పాప గ్రహము అవుతున్నాడు. కావున చంద్రుడు మకర లగ్నమునకు స్తిర పాప గ్రహము అయ్యాడు.
ఉదా 2 :-
రాసి చక్రములో కటక/కర్కాటక లగ్నమునకు అధిపతి చంద్రుడు . కటక లగ్నమునకు స్థిర పుణ్యుడు కావడము చేత చంద్రుడు కటక లగ్నమునకు శుభ గ్రహము.
ఈవిధముగా లగ్నమును అనుసరించి కొన్ని శుభ గ్రహములు కొన్ని పాప గ్రహములు అవుతున్నవి కాని నిజముగా గ్రహములలో ఎవ్వరూ పాపులు లేరు అన్న విషయము అర్థము చేసుకోవాలి.
చంద్ర గ్రహ కారకత్వములు కొన్ని తెలుసుకుందాము .
చంద్ర గ్రహ కారకత్వములు : -
బుద్ధి, జలము , గాలి , వేగము, సుగంధములు, క్షీరము (పాలు), తెలుపు, సంతోషము, వడ్లు, సౌందర్యము, శిరోబలము, చెవుల బలము, మాత్రురూపము (గర్భము), గౌరవము, రాజ ముద్ర, పక్షులు, గగనము, శయన గృహము, శీతలము(చల్లని), కీర్తి, స్త్రీ, నిద్ర, పుష్పములు, శ్వాస , దూర దేశ ప్రయానములు, సముద్రము, నదులు, చెరువులు, చిరునవ్వు .....
చంద్రుడు బ్రహ్మ అంశన జనించిన వాడు మనము చంద్రుడికి నమస్కరించిన బ్రహ్మ కు నమస్కరించినట్లు.
సృష్టి-స్తితి-లయ లలో సృష్టి కర్త అయిన బ్రహ్మ తన అంశతో ఈ లోకమును పాలించుటకు నియమించిన వాడే ఈ చంద్రుడు.
ఒక్క చంద్రుడిని గూర్చి చెప్పవలనన్న ఒక గ్రంథమే వ్రాయ వచ్చు.
12 రాసులలో కర్కాటక/కటక రాశికి అధిపతి ఈ చంద్రుడు.
వారములలో చంద్రుని వారము సోమ వారము.
ఒక స్త్రీ ఘర్భము ధరించవలేనన్న, ఒక శిశువుకు జన్మ నీయ వలెనన్న అందుకు ఈ చంద్రుడి యొక్క అనుగ్రహము ఉండాలి.
చంద్రుడు శుభుడై శుభ స్తానములో ఉన్నవారికి మంచి సంతానము కలుగుతుంది. ఆ చంద్రుడే పాప గ్రహమై తాను ఉన్న స్తానము ననుసరించి కొంత సంతాన పరమయిన ఇబ్బందులు / లోపము కలిగిస్తాడు.
చంద్రుడు శుభ గ్రహమయిన
చంద్రుడు రూపమున పురుషుడే అయినా స్త్రీ కారకత్వము కలవాడు కావున స్త్రీ పోషకుడు శుభుడై స్త్రీలకు మంచి రూపము , శరీర సౌష్టవము ఇచ్చును. మంచి నిద్ర , ఆనందమును, బంధు మిత్రులతో సంతోషము కలిగించును.
గగనమునకు మరియు జలమునకు అధిపతి కావున దేశ విదేశములకు వాయు , జల మార్గము ద్వారా ప్రయాణమును ఎటువంటి ఆటంకములు లేకుండా చేయును. రాజ ముద్ర కు కారకుడు కావున ప్రభుత్వ రంగమున అధికారిగా చేయును. ప్రభుత్వ అధికారుల వలన లాభము చేకుర్చును.
భార్య, భర్తల మధ్య మంచి సఖ్యతను ప్రేమ అనురాగములను పెంచి వారి సంతానముతో సుఖముగా జీవింపచేయును.
చంద్రుడు బాల్యదశ(20 సం. వరకు) కారకుడు కావున బాల్యమును చక్కగా పోషించి సంతోషము నిచ్చును. బాల్యములో చిక్కులు చిద్రములు లేకుండా చక్కగా కాలము సాగును.
మనసుకు అధిపతి కావున మనసునందు సద్బుద్దిని కల్పించును. కననివి విననివి మనసునందు కల్పించి కొత్త వస్తువులు, కొత్త మార్గములు, కొత్త విధానములను సృష్టింప చేస్తాడు. ఈ రోజు కనిపెట్టిన వస్తువులు(టెక్నాలజీ) అన్నియు ఆ చంద్రుడి అనుగ్రహము వలెనే కలుగు తున్నవి.
స్త్రీలయందు, మాతృమూర్తి యందు గౌరవము కలిగించి వారి మన్ననలను పెంపొందింప చేయును.
వస్త్రములకు అధిపతి కావున చక్కని వస్త్రములు పొందేట్లు చేయును. వస్త్రములు తయారు చేయడములో నైపుణ్యము గడింపచేయును. వస్త్ర వ్యాపారము వలన లాభము కలిగిస్తాడు.
గర్భమునందు గల శిశువునకు ఎటువంటి ఆటంకములు రాకుండా కాపడును. సుఖ ప్రసవము కలుగునట్లు చేయును.
గృహమునందు సర్వ వస్తు సముదాయము(గృహములో వాడు వస్తువులు) దిన దినాభి వృద్ది చేయును. మంచి ఆహారము భుజింపచేయును.
యాత్రలు చేయిన్చును పుణ్యము చేయు మార్గము చూపించును. దైవ దర్శనము చేయించి దైవానుగ్రహము కలిగించును.
విలాసములకు తగు ధనము ఖర్చు చేసి వృధా కాకుండా నిలవచేయించి సంతోషము కలిగించును.
ఇదంతా వారు చేసుకొన్న పుణ్యమును అనుసరించి ఆ చంద్రుడు కలిగించును.
చంద్రుడు పాప గ్రహము అయిన
చంద్రుడు పాప గ్రహ మయిన పైన చెప్పిన వాటిని లోపింప చేయును. వాటికి విరుద్ధముగా చేయును.
శ్వాస యందు, తలయందు లోపము, నాలుక యందు లోపము కల్పించి శ్వాస సంబంధించి తలకు సంబంధించి వ్యాధులు కలిగించును.
బాల్య పోషకుడు కావున బాల్యము చక్కగా సాగక ఇబ్బందులు కలిగించును.
స్త్రీ సుఖము దూరము చేయును స్త్రీ ద్వేశిగా చేయును.
గగనమునకు, సముద్రమునకు అధిపతి కావున ఆకాశ మార్గమున కాని జల మార్గమున కాని ప్రయాణ ఇబ్బందులు కలిగించును.
గృహములో సరియగు వస్తు వులు లేకుండా చేయును ఒకటి ఉంటె మరొకటి ఉందన్నట్టు చేయును.
నాలుకలో లోపము కల్పించి మాటలు సరిగా రాకపోవడము స్పష్టత లేకుండా చేయును.
సరియగు నిద్ర పట్టక అనారోగ్యము కల్పించును. విపరీతమయిన మానసిక ఆందోళనతో దుఖింప చేయును.
అధిక మయిన విలాస వంత మయిన కోరికలు కల్పించి ధనము వ్యర్థము చేసి ఇబ్బందులకు గురి చేయును.
చదువు నందు, పనులయందు మనసు నిలువక జ్ఞాన హీనత్వము కల్పించి పెద్దలచేత తిట్లు తినునట్లు చేయును.
జలముఉన్న చోట ప్రమాదములు లేదా గండములు కల్పించును.
తల్లి ప్రేమను దూరము చేయను, ఇంటికి దూరముగా బ్రతుకునట్లు చేయును.
విదేశ సంచారమునందు ఇబ్బందులు గురిచేయును లేదా వేదేశం వెల్లవలేనని ఆశచూపి ప్రయత్నములను విఫలము చేయును.
ఈ విధముగా ఎవరు చేసుకున్న పాప ఫలములను అనుసరించి వారికీ ఆ చంద్ర కారకత్వము లోపము చేయును.
పూర్వ జన్మలో పాపాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని వదిలి వేసి కనీసం ఈ మానవ జన్మలో మంచి పనులు చేస్తూ నలుగురుకి ఉపయోగపడగలరు, అంతా మంచే జరుగుతుంది.
గ్రహాలకి గ్రహాలు శత్రువులు కాదు, మనషులకి మనషులు శత్రువులు కావద్దని నా మనవి.
మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
మనం మారాలి.