26 February 2016

కాలం స్త్రీ పురుష రూపాత్మకం

కాలం స్త్రీ పురుష రూపాత్మకం… కాలం స్త్రీ పురుష రూపాత్మకం.

 చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుషరూపాత్మకం.

 ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకుగల కాలం స్త్రీ రూపాత్మకం.

 అశ్వనీ నత్రక్షంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం.

 శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో పుచ్చపువ్వులా వెన్నెల కాస్తుంది. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు.


సర్వసృష్టి స్త్రీ నుంచి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి.

 సకల బ్రహ్మంలో సత్వ రజో తమోగుణాలు ఉంటాయి. సత్వం నిలువెల్లా నింపుకొని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడినదాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి.







 సృష్టి, పోషణ, లయం నిర్దిష్టకార్యాల్లో వారికి తగిన సహకారం అందించే శక్తిస్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. సమస్త జగత్తును పాలించేది ఆదిపరాశక్తి. ఈ పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, సరస్వతి, పార్వతియై లోకాలకు సకల సౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తున్నట్లు చెబుతారు.






 మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమినాడు వాగ్దేవి సరస్వతీ పూజ. జ్ఞానభూమికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం.


 ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటాదేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదోరోజు విజయదశమి. ఆ రోజునే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని విశ్వాసం.



అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలు తీయించి కౌరవ వీరులను జయించినది విజయదశమినాడే అని పురాణోక్తి.



 ఆశ్వయుజ బహుళ తదియ అట్ల తదియ- స్త్రీల పండుగ. త్రయోదశి ధనత్రయోదశి. లక్ష్మీపూజ చేస్తారు. నరకచతుర్దశి నాటి గాథలో సత్యభామ పాత్ర పురాణ ప్రసిద్ధమే. అమావాస్యనాడు దీపావళి. దీపావళి బలిచక్రవర్తి గౌరవార్థం జరిగినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. దీపావళినాడు విక్రమార్కుడి పట్టాభిషేకం జరిగిందనే గాథ ప్రచారంలో ఉంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే ఉపనిషద్‌ వాక్యానికి ఆచరణ రూపం దీపావళి.










 తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ జరుపుకొనేదీ ఆశ్వయుజంలోనే. ఈ మాసంలో జరిగే ప్రతి ఉత్సవమూ పండుగా స్త్రీ ప్రాధాన్యం కలిగినవే. అందుకే ఆశ్వయుజం మహిళామాసం.










No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.