11 September 2016

శ్రావణ మాసం

🌺
మన వంశం అభివృద్ధి
చెందాలన్నా ,
మన కుటుంబం క్షేమంగా
ఉండాలన్నా .
మన ఇంట్లో స్త్రీలు సుమంగళిగా
ఉండాలన్నా ,
సమస్త కోరికలు తీరాలంటే ...
శ్రావణలక్ష్మి మాతను నిష్టగా
సేవిస్తే చాలు .
🌺
శ్రావణమాసమంటేనే
పవిత్రమైన మాసం.
శ్రావణ మాసంలో ప్రతిఇల్లు పవిత్రంగా కనిపిస్తుంది.
శ్రావణమాసం వస్తూనే సకల శుభాకార్యాలను తీసుకొస్తుంది.
🌺
ఈ మాసంలోనే
శ్రీకృష్ణుడు .. వామనుడు .. హయగ్రీవుడు అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి .
🌺
శ్రావణమాసంలో
మంగళ,శుక్రవారాలు విశిష్టతను
సంతరించుకుని కనిపిస్తాయి.
🌺
శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు  ప్రీతికరమైనమాసం .
మంగళవారం రోజున
మంగళ గౌరిదేవి
ఆరాధనలో భాగంగా నోములు వ్రతాలు చేస్తుంటారు.
సంతాన సౌభాగ్యాలను
ఆ తల్లి రక్షిస్తూ ఉంటుంది .
🌺
ఇక శుక్రవారాల్లో వరలక్ష్మీదేవిని
సేవించడం వలన ఆ తల్లి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు,
అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
🌺
ఈ మాసంలో,
వివాహమైన స్త్రీలు
తమ వంశాభివృద్ధికొరకు ,
కుటుంబక్షేమం కొరకు
వరలక్ష్మి మాతను కొలుస్తుంటారు.
ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం.
ఈ వరలక్ష్మి మాతను ఆరాధన చేస్తే ఐష్టెశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం,శక్తి వంటివి లభిస్తాయి .
🌺
ఈమాసంలో
ఉదయం,సాయంత్రం
దీపారాధన చేయడం వలన దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
🌺
అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవి .
🌺
ఈ మాసంలో
అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి.
🌺
నమస్తేస్తు మహామామే
శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే
మహాలక్ష్మీ నమోస్తుతే
🌺
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని,
దేవతలు నిరంతరం సేవించే లోకమాత,
శంఖ,చక్ర,గదలను ధరించిన
మహాలక్ష్మీదేవి అష్త్టెశ్వర ప్రదాయిని.
అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని.
అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం.
🌺
శ్రావణ శుక్ల పూర్ణిమకు
ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని తన ప్రియభక్తులకు వరలక్ష్మిదేవి అభయమిస్తుంది.
🌺
సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం,
నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు వరలక్ష్మీదేవికి పూజ చేసి,
నవకాయ పిండివంటలూ,
పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి,
చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ముత్తైదువలకు తాంబూలం సమర్పిస్తూ
ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.
🌺
వరాలనిచ్చే లక్ష్మి కనుక
వరలక్ష్మి అయింది.
🌺
ఈమాసంలో తనను కోరికలతో
పూజించిన వారి కోరికలన్నీ తీరుస్తాను.
కోరికలు లేకుండా పూజించిన వారికి మొక్షాన్నీ ఇస్తానని స్వయంగా వరలక్ష్మి దేవినే భక్తులకు అభయమిస్తుంది .
🌺
ఎవరైతే శ్రావణమాసంలో
ఏక భుక్తము
(ఒక్కపూట భోజనం) చేస్తూ ఇంద్రియనిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలితమే కాక
వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.
🌺
ఈ నెలలో దైవకార్యాలు
స్వల్పంగా చేసినాసరే అవి
అనంత ఫలితాలను ఇస్తాయి.
🌺
మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. ఫలహారము లేదా హవిష్యాన్నాము
ఆకులో మాత్రమే భుజించాలి.
ఆకుకూరలు తినరాదు.
🌺
ఈ మాసంలో చేసే నమస్కారములు,ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయి .
🌺
స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన
లలితా సహస్రనామాది
స్తోత్ర పఠనాలు,
నోములు,వ్రతాలు,మోహమును తొలగించి,సౌభాగ్యమును ఇస్తాయి .
🌺
శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని,గృహస్థులు గాని,శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.