10 September 2016

భక్తి ప్రాధాన్యత మరియు సాధన.

భక్తి అంటే??............??? మనుషులలో ఉండే గుణబేధాన్ని బట్టి భక్తి మూడు సంఖ్యల ప్రాధాన్యం .
పరపీడనే లక్ష్యంగా దంభాచారంతో, కామక్రోధమాత్సర్యాలతో
సాగేది తామసిక భక్తి.
తన కల్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో
యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి.
నేను వేరు, తానూ వేరు అనే బేధబుద్దితో సాగిస్తాడు కనుక ఇతడూ
పామరుడే.
స్వార్థ చింతన లేకుండా పరమేశ్వర అర్పణంగా
పాపప్రక్ష్యాళణ లక్ష్యంగా తమ వేదోక్తమే కనుక
అవస్య కర్తవ్యమ్ అనే నిశ్చయంతో, దైవ ప్రీతికోసం చేసే
భక్తిని సాత్విక భక్తి అంటారు. నేను వేరు, తానువేరు అనే
బెదబుద్ధి ఇక్కడా ఉంటుంది. ఐతే ఇది పరభక్తికి సోపానం
అవుతుంది కనుక తామస, రాజస భక్తుల కన్నా ఇది
ఉత్తమోత్తమం.
పరభక్తి అంటే?
దైవగుణములను నిత్యమూ ఆలకించడం, దివ్యనామాలను నిరంతరం
గానం చేయడం. దైవం యందు ఎడతెరిపి లేని తైల ధారగా మనసును
ఎల్లవేళలా వర్తింపజేయడం. హేతువు ఉన్నా లేకపోయినా
దైవాన్ని అర్చించడం కన్నా మించినది లేదని భావించి సేవించడం,
మోక్షాన్ని కూడా వాంచించకుండా, సేవ్య సేవకతా భావాన్ని
విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణికోటిలోనూ దైవాన్ని
దర్శించడం. తనపట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగము
ఉంటాయో, అంతగాను దైవం పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య
సామాన్యాన్ని బట్టి తనకూ దైవానికీ బేధాన్ని గాహించడం.
ఎవ్వరికీ ఎప్పుడూ ద్రోహాన్ని తలపెట్టని దశకు చేరుకోవడం.
దేవాలయాన్ని, దైవ భక్తులను నిరంతరం దర్శించడం, దైవం గురించి
చెప్పే శాస్త్రాలను, మంత్రాలను అధ్యయనం చేయడం, దైవం
మీద ప్రేమతో నిరంతరం పులకించి పోతూ ఆనందభాష్పాలు రాలుస్తూ
గద్గద స్వరంతో దైవనమాన్ని జపిస్తూ అనన్య భావంతో
పూజించడం. ధన వ్యయానికి లోభించకుండా దైవ నిత్య నైమిత్తిక
వ్రతాలన్నింటిని ఆచరించడం, దైవ ఉత్సవాలను దర్శించడమే
స్వభావంగా వహించడం, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార
దేహతాదాత్మ్య రహితుడై నృత్యం చేయడం, దేహ సంరక్షణ
దృష్టిని విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందొ అది
అలా జరుగుతుందని దృడంగా విశ్వసించి వర్తించడం. ఇది పరభక్తి
నిదర్శనాలు.
ప్రారబ్ధం వలన భక్తుడైన వాడికి బ్రహ్మ జ్ఞానం కలుగదు.
కేవలం బ్రహ్మ జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. ఇహంలోనే
ఉంటూ ప్రత్యగాత్మను హృదయస్థం చేసుకొని సంవిత్పర
శరీరుడైన జ్ఞానికి బ్రహ్మతత్త్వమే తప్ప మరణం లేదు.
జ్ఞానం వలన అజ్ఞానాన్ని నశింపజేసుకుని తనలో ఉన్నదానినే
తాను పొందడం. ఇది బ్రహ్మజ్ఞానోపలబ్ది అంటే. మెడలో ఉన్న
బంగారు గొలుసును తడిమి తెలుసుకున్నట్లు, మనిషిలో నిబిడీకృతమై
ఉన్న పరమాత్మను తెలుసుకోవడం.
విదిత అవిదితాలకు అతీతమైనది శక్తి స్వరూపం. అద్దంలో
ప్రతిబింబంలా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ
ఉంటుంది. లోకంలో వెలుగునీడలు స్వచ్చంగా ఎలా విడివిడిగా ఉంటాయో,
ద్వైతబావవివర్జితమైన బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడలా
ఆ పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మజ్ఞాని ఆత్మలో
నిలుస్తుంది. వైరాగ్యభావం తో ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా
మరణించిన వాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచి శ్రీమంతుల
గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన
కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానమనేది అనేక
జన్మల సాధనతో లభిస్తుందే తప్ప ఏదో ఒక జన్మలోనే
లభించదు. అందుచేత ప్రతిజన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం
కొనసాగించాలి. అలా కొనసాగించకపొతే నరజన్మమే
దుర్లభమవుతుంది. ఇంద్రియ నిగ్రహం మరుజన్మలో ఉండాలి
అంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం.
అతి దుర్లభమైన మానవజన్మ లభించినా బ్రహ్మజ్ఞానం కోసం
ప్రయత్నించని వారి జీవితం పూర్తిగా నిరర్ధకం. జ్ఞానమనేది
పాలలో మీగడలా సకల సృష్టిలో అభివ్యాప్తమై ఉంటుంది. దానిని
మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా మధించి దానిని పొందగలగాలి.
అదే జన్మకు చరితార్థత.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.