14 October 2016

మన ఇంట్లో దీపారాధనకు చేయడానికి నియమాలు


దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి.
ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి.








ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.








దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.
దీపం సకల దేవతాస్వరూపం
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం.






ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి.








దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.




దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.


ఐదు వత్తులు :
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.

ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.
దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు ఇనుప కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.



మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.













No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.